ఒకే ఓవర్లో 4, 4, 4, 4, 4, 4..సిరీస్ సమం!
డంబుల్లా వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఆకట్టుకున్నారు. షామార్ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు బాదారు. తొలి బంతి లెగ్ బై ఫోర్ వెళ్లగా, ఆ తర్వాత 4, WD, 4, 4, 4, 4 కొట్టారు. మొత్తంగా అర్థ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్ పథుమ్ నిస్సంక 54 రాణించగా.. కుసాల్ మెండిస్ 26, కుసాల్ పెరీరా 24, కమిందు మెండిస్ 19, చరిత్ అసలంక 9, భానుక రాజపక్స 5, వనిందు హసరంగ 5 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అల్డరీ జోసఫ్, షమార్ జోసఫ్, షమార్ స్ప్రింగర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. దునిత్ వెల్లెంగే 3, అసలంక, మహేష్ తీక్షణ, హసరంగ తలో రెండేసి వికెట్లను సాధించారు. 3 టీ20ల సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో ఉన్నాయి. ఎల్లుండి కీలకమైన మూడో టీ20 జరగనుంది.