తెలుగోడి సత్తా..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు పోస్టర్లు
నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ గా జరగనున్న ఈ అగ్రరాజ్య అధ్యక్ష పీఠ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఈ సమయంలో ప్రవాస భారతీయ ఓటర్ల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా డల్లాస్‌లో తెలుగులో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీ కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న పోస్టర్లు పక్క పక్కనే ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా,అమెరికాలో నివసించే అత్యధిక విదేశీయుల్లో భారతీయులు మొదటి స్థానంలో ఉంటారు. చదువు, ఉద్యోగం కోసం వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో పెద్ద పెద్ద స్థానాల్లో.. రాజకీయ నేతల్లో భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. ఇక ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న కమలా హారిస్ మూలాలు కూడా భారత్‌లోనే ఉండటం గమనార్హం.